విశాఖ డేటా సెంటర్ క్రెడిట్ గత వైసీపీ ప్రభుత్వానిదే: గుడివాడ అమర్నాథ్
- జగన్ హయాంలోనే అదానీ గ్రూప్‌కు 130 ఎకరాల భూమి కేటాయించామన్న గుడివాడ
- అప్పట్లోనే తాము సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాశామని వెల్లడి
- ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం గట్టి హామీ తీసుకోలేదని విమర్శ
విశాఖ డేటా సెంటర్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు క్రెడిట్ గత వైసీపీ ప్రభుత్వానిదేనని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్ హయాంలోనే అదానీ గ్రూప్‌కు 130 ఎకరాల భూమి కేటాయించామని, 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్‌గా మార్చేందుకు తాము పునాదులు వేశామని ఆయన స్పష్టం చేశారు. గూగుల్ సంస్థ విశాఖకు రావడానికి అప్పట్లోనే తాము సింగపూర్ ప్రభుత్వానికి రాసిన లేఖలు, సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీ ప్రయత్నాలే కారణమని గుర్తుచేశారు.
అయితే, ప్రాజెక్ట్ అమలు తీరుపై అమర్నాథ్ తీవ్రమైన సందేహాలను లేవనెత్తారు. ప్రభుత్వం సుమారు రూ. 22 వేల కోట్ల భారీ రాయితీలు ఇస్తున్నప్పటికీ, ఒప్పందంలో కేవలం 200 ఉద్యోగాల ప్రస్తావనే ఉండటంపై ఆయన మండిపడ్డారు. మొదట్లో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అలాగే, గూగుల్ కేవలం డేటా హబ్ కే పరిమితం కాకుండా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాయితీలు ఇచ్చే సమయంలో ఉద్యోగాల కల్పనపై గట్టి హామీ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.